22, ఫిబ్రవరి 2015, ఆదివారం

పల్లె అందం

పల్లెటూరితో సంబంధం వున్నవాళ్ళు మరోసారి ఆ సౌందర్యాన్ని మననం చేసుకోవడానికి వీలుగానూ, సంబంధం లేని వాళ్ళు ఆ సౌందర్యాన్ని మరోసారి చూడడానికి వీలుగానూ కొన్ని ఫోటోలు ........................‘కోర్కె తీరగా పంట పండింది. దంచిన కొత్త బియ్యపు పిండి ఆరబోసినట్లున్న శరత్కాలపు వెన్నెలరాత్రిలో ఆనందంతో రైతు గొంతు విప్పి పాట పాడు తున్నాడు’ అని ఈ గాథకు పెద్దలు చెప్పిన అర్ధం. భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించే ఒక పల్లెటూరి రైతు జీవితంలో దైవం అనుగ్రహిస్తే పదే పదే పునరావృతమయ్యే ఒక సన్నివేశాన్నీ, ఆ సన్నివేశంలోని సౌందర్యాన్నీ కనులకు కట్టినట్లు అతి తక్కువ మాటలలో వర్ణించి చూపెట్టే ఈ గాథను ఎన్ని సార్లు చదివినా, మననం చేసుకున్నా, తనివి తీరనట్లుంటుంది.
అచ్చమైన ఆప్యాయతతో రైతు కాళ్ళకు అంటుకునే పొలంలోని మట్టీ, మట్టిని తడిపి తమకంతో తబ్బిబ్బయ్యే నీరూ, స్వచ్చంగా వీచే గాలీ, రాబోయే పంటమీదా, పచ్చదనం మీదా కారుణ్యంతో కాచే ఎండ, కాలం కనికరించి అన్ని కలిసొస్తే ఏ దిక్కుకేసి చూసిన కళ్ళ నిండుగా కనిపించే పచ్చదనం….ఇవన్నీ పల్లెటూరు అనే పడతికి ప్రకృతి తనంత తానుగా తొడిగి చూపించిన నిలువెత్తు ఆభరణాలు. జీవితంలో ఏ కొంత భాగమైన పల్లెటూరిలో గడపడం అన్నది సంభవించిన ఏ వ్యక్తికైనా వీటి సహజ సౌందర్యం ఏమంత కష్ట పడకుండానే మనసుకు తట్టి కనులకు కడుతుంది.
ఆధునిక జీవన శైలిలో, పొట్టకూటికోసం అనుకున్నా, మరెందుకోసం అనుకున్నా, తనదైన పల్లెటూరిని విడిచి పట్టణానికి వలస వెళ్ళల్సి రావడం సంభవించిన వ్యక్తికి, తలచుకునే సందర్భం దొరికినప్పుడల్లా, వాటి సహజ సౌందర్యం మనసును పూర్తిగా కమ్మేసి, ఆ దృశ్యాలను విడిచి పెట్టి  ప్రస్తుతంలోకి రావడానికి ఒక పట్టాన ఇష్టపడక మనసు మొరాయిస్తూనూ వుంటుంది.  తప్పనివి అయినా కాకపోయినా, తెచ్చిపెట్టుకున్నవి అయినా కాకపోయినా….ఈ వియోగాలు ఇప్పటి జీవితంలో తప్పించుకోలేని అంతర్భాగాలయిపోయాయి. అంగీకరించాలిసిందే తప్ప, అందులో బాధపడాలిసింది కూడా ఏమీ లేదనే అనుకోవాలి!