28, జూన్ 2015, ఆదివారం

మన గోదావరి జిల్లా - భిన్నత్వంలో ఏకత్వం

 మూలం :  http://manakakinadalo.blogspot.in/2013/01/blog-post_2314.html

మన తూర్పుగోదావరి, జిల్లా పరంగా ఒక్కటే కానీ, భూభౌతిక ప్రత్యేకతల దృష్ట్యా భిన్నమైన ప్రాంతాలుగా ఉంది. 


ప్రజల వృత్తులు, జీవన విధానం, సంస్కృతీ సాంప్రదాయాలు, మాట్లాడే భాషలో వ్యత్యాసాలు (మాండలీకాలు అనలేము కానీ, ఒకే మాండలీకంలో వివిధ ఛాయలు) మొదలైన వాటివల్ల ఇక్కడ ఒకవిధమైన భిన్నత్వంలో ఏకత్వం ఉందని చెప్పవచ్చు. 

పైన భూభౌతిక ప్రత్యేకతలు అని చెప్పడం జరిగింది. అవి ఏమిటంటే - సముద్ర తీర ప్రాంతం; సారవంతమైన భూమి, నీటిపారుదల ఉండి సమృద్దిగా పంటలు పండే కోనసీమ ప్రాంతం; వర్షాధారం మీద ఆధార పడి ఉండే మెట్ట ప్రాంతం; అడవులు, వాటిని చేర్చి ఉండే ఏజన్సీ ప్రాంతాలు. 
ఈ నాలుగు చోట్లా భిన్నమైన జీవనశైలి, సంస్కృతీ మనకు కనిపిస్తాయి. చేపలు పట్టుకొని జీవించే మత్యకారులు, అటవీ సంపదమీద ఆధారపడి జీవించే ప్రజలు, నదీపరివాహిక ప్రాంతంలో జీవించే వ్యవసాయదారులు, సరైన పంటలు పండని మెట్టప్రాంతంలో వారు - ఒకే జిల్లాలో ఎన్ని వైవిధ్యభరితమైన జీవన విధానాలో చూడండి. 
గంగమ్మ తల్లిని ఒకచోట సేవించుకొంటే, వనదేవతలని మరొకచోట కొలుచుకొంటారు. పురాణాల్లో కనిపించే దేవతలు, దేవుళ్ళ ఆలయాలు ఇంకొక ప్రాంతంలో విరివిగా కనిపిస్తాయి.
ఇక్కడ ఉన్న చిత్రాలలో పైన చేసిన పరిశీలనలని చూడవచ్చు. జిల్లాలో ఒకచోట నుంచి మరొక చోటకి వెళ్ళి నప్పుడు ఈ వ్యత్యాసాలని దృష్టిలో ఉంచుకొని పరిసరాలనీ, ప్రజలనీ గమనిస్తే ట్రిప్‌ని మరింత బాగా ఆనందించగలం. ఒప్పుకొంటారా?
(ఫోటోలు డి.ఆర్.డి.ఏ వాళ్ళు ఇచ్చినవి. ప్రోజెక్ట్ డైరెక్టర్ శ్రీ మధుకర్ బాబు గారికి కృతజ్ఞతలు. మేప్ మేప్స్ ఆఫ్ ఇండియా వారిది.) 
*     *     *
తూర్పుగోదావరి జిల్లా వివరాలు 

విస్తీర్ణం: 10,807 చదరపు కిలోమీటర్లు
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 51,51,549 మంది. 
జనసాంద్రత: చదరపుకిలోమీటరుకి 480 మంది.
అక్షరాస్యత: 71 శాతం
మండలాలు: 60
గ్రామాలు: 1400
మునిసిపల్ కార్పొరేషన్లు: 02(రాజమండ్రీ, కాకినాడ) 
మునిసిపాలిటీలు: 09 
ఎసెంబ్లీ నియోజకవర్గాలు: 19
 1. కాకినాడ అర్బన్
 2. కాకినాడ రూరల్
 3. పిఠాపురం
 4. పెద్దాపురం
 5. జగ్గంపేట
 6. ప్రత్తిపాడు
 7. తుని
 8. అమలాపురం
 9. కొత్తపేట
 10. పి.గన్నవరం
 11. రాజోలు
 12. ముమ్మిడివరం
 13. రామచంద్రపురం
 14. మండపేట
 15. రాజమండ్రీ అర్బన్
 16. రాజమండ్రీ రూరల్
 17. అనపర్తి
 18. రాజానగరం
 19. రంపచోడవరం

లోక్‌సభ నియోజకవర్గాలు: 03

 1. కాకినాడ
 2. రాజమండ్రీ
 3. అమలాపురం