21, జూన్ 2015, ఆదివారం

నేడు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’


నేడు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ముఖారవిందం చిరునవ్వు చిందిస్తోంది. శరీరం తేలికపడింది. నడకలో వేగం పెరిగింది. మాటలో సూటిదనం. భావంలో స్పష్టత! మొత్తంగా... మనసు, మాట, చేతల మధ్య మునుపెన్నడూ లేని సమన్వయం, సమతౌల్యం, సమభావం!మనిషిలో గణనీయమైన, సానుకూల ‘మార్పు’! ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో, ఒక్కసారిగా గమనించారా? అయితే... ‘ఏమిటీ రహస్యం?’ అని అడగండి! ‘ఈ మధ్య యోగా చేస్తున్నా’ అనే సమాధానం వస్తుంది! ఔను... యోగా ఆరోగ్యకరం, ఆనందకరం, ఆహ్లాదకరం! ఇది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది! యోగామీద సవాలక్ష సందేహాలకు స్వస్తి చెప్పండి. ‘ఒంటికి యోగా మంచిదే’నని సశాస్త్రీయంగా రుజువైంది. భారత్‌లో పుట్టిన యోగా విశ్వవ్యాప్తమైంది. ఐక్యరాజ్యసమితి యోగావల్ల బాగును గుర్తించింది. ‘యోగా చేయండి. బాగా ఉండండి’ అంటూ విశేష ప్రాచుర్యం, ప్రాశస్త్యం కల్పించి ఏటా జూన్‌ 21ని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించింది.ఈ ఆదివారమే ప్రపంచం తొలి యోగా దినోత్సవాన్ని జరుపుకొంటోంది. యోగ అంటే... యోగా అనగానే ‘ఆసనాలు’ గుర్తుకొస్తాయి. కానీ... యోగా పరిధి, ప్రయోజనం చాలా విస్తృతం. జీవనశైలిని, ఆలోచనను, దృక్పథాన్ని, ప్రవర్తనను యోగ సాధన విశేషంగా ప్రభావితం చేస్తుంది. మహనీయులు మానవాళికి సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగాన్నందించే ‘యోగా సూత్రాలను’ వరంగా ఇచ్చారు. యుజ్‌ అనే సంస్కృత ధాతువునుంచి ‘యోగం’ అనే పదం వచ్చింది. అంటే... కలయిక, అనుసంధానం అని అర్థం. అంటే... మనశ్శరీరాల అనుసంధానమే యోగ. యోగ సూత్రాలు రచించిన పాణిని ‘యోగ అంటే దృష్టి కేంద్రీకరణ’ అని నిర్వచించారు. ‘మనసును స్థిరం చేసుకుని, ఆ పరమాత్మ మీద దృష్టి కేంద్రీకరించేదే యోగ’ అని పతంజలి చె ప్పారు. భారతీయ తత్వజ్ఞాన భాండాగారాలైన షట్దర్శనాలలో యోగ దర్శనం ఒకటి. యోగా ఎప్పుడు పుట్టిందన్న ప్రశ్నకు భిన్న వాదనలున్నా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో కపిల మహర్షి సాంఖ్య దర్శనాన్ని, క్రీస్తుశకం ఒకటో శతాబ్దంలో పతంజలి యోగసూత్రాలను రచించి ఆ విద్యకు సాధికారత కల్పించారని చెబుతారు. వేదాల్లోనే ఉందట... ‘‘యోగా... అంటే ఆసనాలు మాత్రమే కాదు! శరీరం, మన సు, ఆత్మల సమున్నత కలయిక!’’... అని ఆర్ట్‌ ఆఫ్‌ లివిం గ్‌ సంస్థ నిర్వచించింది. ‘‘నాలుగు వేదాలు... వాటి నుంచి నాలుగు ఉప వేదాలు... వాటికి 6 ఉపాంగాలు... ఈ ఉపాంగాలకు మరో 6 ఉప శాఖలు! ఈ ఉపశాఖల్లో ఒకటే యోగా!’’ అని చెబుతారు. ఇందులో జ్ఞాన, భక్తి, కర్మ, హఠ, రాజ, మంత్ర, శివ, నాద, లయ... ఇలా యోగ ప్రక్రియలెన్నో... యోగాను తొలిసారి సాధికారికంగా బోధించింది, పరిశోధించింది... పతంజలి మహర్షి. ఆయన 5వేల ఏళ్లకిందటే యోగాను శోధించి, 8 యోగ క్రియలను బోధించారు. అవి... ‘యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి! వీటిలో శరీర భంగిమలకు సంబంధించిందే ‘ఆసన’. ప్రస్తుతం యోగా అంటే ‘ఆసనాలు’ అనే అర్థమే స్థిరపడింది. ‘గీత’ చెప్పిన ‘యోగా కళ’ ‘యోగః కర్మషు కౌశలం’ అని భగవద్గీత చెబుతోంది. ‘భావ వ్యక్తీకరణలో, క్రియలో నైపుణ్యం సాధించేదే యోగ’ అని దీని అర్థం. భగవద్గీతకు సంబంధించి... యోగా అంటే ఆసనాలు కాదు. ఇదో మానసిక నైపుణ్యం (మైండ్‌స్కిల్‌). ఏ పనినైనా పూర్తి శ్రద్ధ, ప్రేమ, ఆసక్తితో చేయడమే ‘కర్మ యోగం’. యోగా అంటే ‘మానసిక సమతౌల్యం, సమభావం’ (ఈక్వానిమిటీ ఇన్‌ ది మైండ్‌). భారతీయ జీవన విధానంలో వేల ఏళ్లుగా యోగా ఓ భాగమైంది. 19వ శతాబ్దంవరకు రాజయోగం బహుళప్రాచుర్యంలో ఉంది. కాలం, అవసరాల మేరకు యోగసూత్రాల్లో మార్పుచేర్పులు జరిగాయి. మార్గమేదైనా యోగసాధన పరమార్థం దేహాన్ని, మనసును నిర్మలంగా ఉంచుకుంటూ పరిపూర్ణ ఆరోగ్యకర జీవనంతో ఆనందమార్గాన్ని అందుకోవడమే! విశ్వం..... యోగమయం! ఆధునిక జీవన కార్యక్షేత్రంలో ఒత్తిడి, ఇంట్లో ఒత్తిడి! వెంటాడే కోరికలు... వేటాడే టార్గెట్లు! ఇన్ని ఇక్కట్లమధ్య మనిషి ఉక్కిరి బిక్కిరి. దీంతో ‘జీవన శైలి’తో ముడిపడి పోటెత్తుతున్న వ్యాధులు. అందుకే... సకల ప్రపంచానికి యోగా ఒక బాగు మార్గంగా మారింది. ఏదైతేనేం... సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక పర్యాయపదమైంది. అందుకే ఐక్యరాజ్యసమితి కూడా యోగాను సాధికారికంగా గుర్తించి ఏడాదిలో ఓ రోజును దీనికి అంకితం చేసింది.