22, జూన్ 2015, సోమవారం

దేశభాషలందు తెలుగులెస్స

ఆంధ్రత్వమాంధ్ర భాషా చ నాల్పస్య తపసః ఫలమ్'
తెలుగు వాడిగా పుట్టటం ఒక వరం.
తెలుగు భాషను మాట్లాడటం ఎన్నో జన్మల తపఃఫలం.
అటువంటి మన తెలుగుభాష... వెలుగుభాష, తేటతెలుగు-మేటితెలుగు, తేనెలొలికే తెలుగు జానుతెలుగని కీర్తి వహించింది.


అమ్మ అనే మొదటిమాట అందించినభాష ఇదే
 తెరపి వెన్నెలల ఆణిముత్యాల సొబగు, పునుగుజవ్వాజి ఆమనిపూలవలపు, మురళిరవళులు, కస్తూరి పరిమళాలు కలిసి ఏర్పడిన భాష. అందుకే ఆ మాధుర్యం.
నన్నయ సుధామయ సూక్తులలో ఓలలాడి.... తిక్కన రణతంత్రపుయుక్తులతో రాటుదేలి, ఎర్రన వర్ణనలతో సొబగులూని, శ్రీనాథుడి రాజసంతో హొయలు నేర్చి, రాయల ప్రౌఢిలో లెస్సపలికి, పోతన భక్తిమాధురిలో ఒదిగిపోయి... నేటివరకూ కవుల కలాల్లో తెలుగుప్రజల గళాల్లో చైతన్యం నింపిన భాష... జాతికి జాగృతి నందించిన భాష.
 'విశ్వశ్రేయః కావ్యమ్' అని చాటి చెప్పిన భాష మన తెలుగు భాష.
సుద్దులు చెప్పిన బద్దెన్న, ఆటవెలదుల ఈటెల్ని విసిరిన వేమన్న, పలుకుబడిని తన గళంలో పండించిన అన్నమయ్య మొదలైన కవులు తెలుగువారి కీర్తిపతాకను విశ్వవీథిన ఎగురవేశారు.
మన సంగీతం- ఇంత విశ్వవ్యాప్తం అయ్యిందంటే-అది త్యాగయ్యగారి నాదాల చలువే.
లోకంలో భక్తి ఇంతగా పెరగడానికి పోతన్నగారి భాగవతం చలువే.
తెలుగుశిల్పం ఇంతగా ఖ్యాతిని పొందిందంటే- దానికి కారణం జక్కన శిల్పాల చలువే. తెలుగు సాహిత్యాభిరుచి ఇంతగా దిగంతాలకు వ్యాపించడానికి శ్రీకృష్ణదేవరాయల రాసిక్యం చలువే.
ఒక్క సత్యవాక్యం.. వందమంది కొడుకుల కంటే గొప్పదని చాటిచెప్పిన మహాభారతం ప్రపంచసాహిత్యంలోనే నభూతోనభవిష్యతి. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట.. అని నిష్కామకర్మకు ప్రతీకగా నిలిచిన భాగవతమూ ఒక్క తెలుగు వారికే సొంతం.
మొఘల్ సామ్రాజ్యవీథుల్లో తన కవితాసౌరభాల్ని వెదజల్లిన జగన్నాథపండితరాయలు మన తెలుగువాడే.
విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన రాయసోదరులూ తెలుగువారే.
రాజాధిరాజుల చేత పల్లకి మోయించుకొన్న పెద్దన తెలుగువాడే.
కాళిదాసకృతులకు వాఖ్యానం వెలయించిన మల్లినాథసూరి మన తెలుగువాడే..
గతమెంతో ఘనకీర్తి కలిగి, దేశభాషలందు తెలుగులెస్సని కొనియాడబడిన మన తెలుగు భాష ఎప్పటికప్పుడు అవసరానికి తగినట్లుగా కొత్తరూపుదాల్చటం తెలుగువారి భాగ్యం.