19, జూన్ 2015, శుక్రవారం

''గోదార‌మ్మ'' మీద ప్ర‌మాణం చేస్తున్నాం..

''గోదార‌మ్మ'' మీద ప్ర‌మాణం చేస్తున్నాం.. ఊపిరి ఉన్నంత వ‌ర‌కు కాలుష్యం మీద పోరాడతాం
 అమ్మ అంటే అడ‌క్కుండానే పిల్ల‌ల‌కు ఏం కావాలో పెడుతోంది. గోదార‌మ్మ కూడా అంతే.. మ‌న పూర్వీకుల‌తో పాటు.. మ‌న త‌రాన్ని క‌న్న‌పిల్ల‌ల్లానే చూస్తోంది. మ‌న కోట్లాది మంది గొంతులు త‌డుపుతూ సాగు..తాగునీరు అందిస్తోంది. కుల‌, మ‌త‌, ప్రాంత భేదాలు.. లేకుండా మహారాష్ర్ట‌లో పుట్టి తెలంగాణ మీదుగా ప్ర‌వ‌హిస్తూ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు ఊపిరిపోస్తోంది. రానున్న రోజుల్లో వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ జిల్లాల‌కు వెళ్ల‌బోతోంది. మ‌న‌త‌రంతో పాటు మ‌న భ‌విష్య‌త్తు త‌రాల‌కు స్వ‌చ్ఛ‌మైన అమ్మ ప్రేమ పంచాల్సిన గోదార‌మ్మ‌కు తీవ్ర అప‌చారం జ‌రుగుతోంది. క‌న్న‌త‌ల్లి లాంటి గోదావ‌రి న‌దిపై కాల‌కూట విషం క‌క్కుతున్న న‌ల్ల‌త్రాచుల ప‌డ‌గ‌నీడ ప‌డింది. స్వ‌చ్ఛ‌మైన జ‌లాల్ని క్ర‌మేపి విష‌మెక్కిస్తున్నాయి. మ‌నిషిని నిలువెల్లా ద‌హించేసే మూల‌కాల‌తో కూడిన ర‌సాయ‌నాల‌తో విష తుల్యంగా మారిపోయింది. కేంద్ర ప్ర‌భుత్వ నివేదిక‌లు, కాగ్ రిపోర్ట్స్ చూస్తే నిజంగా భ‌య‌మేస్తోంది. గోదావ‌రి జ‌లాల్లో కాల‌కూటం లాంటి విష ప‌దార్థాల‌తో పారిశ్రామిక కాలుష్యం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. మురుగునీరు మొత్తం కాల్వ‌లు, చెరువుల‌తో పాటు గోదావ‌రిలో వ‌దిలేస్తున్నారు. దీనిపై ఉద్య‌మించ‌క‌పోతే మ‌న త‌రంతో పాటు మ‌న భ‌విష్య‌త్తు త‌రాల‌కు భారీ న‌ష్టం త‌ప్ప‌దు. అందుకే విశ్వ‌మాన‌వ‌వేదిక గోదావ‌రి న‌దీ జ‌లాల్లో కాలుష్య ప్ర‌క్షాళ‌న‌కు ప్ర‌భుత్వాలు ముందుకు రావాల‌ని కోరుతోంది. ప్ర‌జ‌లు త‌మ వంతుగా కాల్వ‌లు, చెరువులు, గోదావ‌రిలో మురుగునీరు చేర‌కుండా కృషి చేయాలి. ఇదంతా చైత‌న్య కార్య‌క్రమాల‌తోనే మార్పు వ‌స్తుంద‌ని విశ్వ‌మాన‌వ‌వేదిక భావిస్తోంది. అందుకే గోదావ‌రి న‌దీ ప‌రివాహ‌క ప్ర‌దేశాల్లో కాలుష్య ప్ర‌క్షాళ‌న‌కు మ‌న వంతుగా ఏం చేయాల‌నే దానిపై కార్య‌క్ర‌మాలు రూపొందిస్తోంది. ఇందులో తొలి అడుగుగా విశ్వ‌మాన‌వ‌వేదిక ''గోదావ‌రి ప్ర‌తిజ్ఞ‌ చేసింది. తూర్పుగోదావ‌రి జిల్లా స‌ఖినేటిప‌ల్లి గోదావ‌రి తీరం ఇందుకు వేదికైంది. గోదావ‌రి తీరంలో ఉన్న విప్ల‌వ‌జ్యోతి అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం సాక్షిగా.. ఒక విదేశీయుడైన‌ప్ప‌టికీ భార‌తీయుడు వ‌లె దేశ‌భ‌క్తిని చాటి గోదావ‌రి జిల్లాల‌కు అన్నం పెడుతున్న స‌ర్ ఆర్ద‌ర్ కాట‌న్ స్ఫూర్తితో గోదావ‌రి మాత మీద మేం ప్ర‌మాణం చేశాం. ఊపిరి ఉన్నంత వ‌ర‌కు కాలుష్యం మీద పోరాడతామ‌ని తెలియ‌జేశాం. విశ్వ‌మాన‌వ‌వేదిక స‌భ్యుల‌తో పాటు..విశ్వ‌మాన‌వ‌వేదిక వృద్ధాశ్ర‌మం వృద్ధులు, విక‌లాంగులు, గోదావ‌రి అభిమానులు గోదావ‌రి ప్ర‌తిజ్ఞ‌లో పాల్గొన్నారు. విశ్వ‌మాన‌వ‌వేదిక స‌ల‌హాదారు శ్రీ కోట సూర్య ప్ర‌భాక‌ర‌రావు గారు గోదావ‌రి ప్ర‌తిజ్ఞ చేయించారు.
గోదావ‌రి ప్ర‌తిజ్ఞ‌
''మేం గోదార‌మ్మ బిడ్డ‌లం. త‌ర‌త‌రాల‌గా అమృత‌జ‌లం తాగుతూ పునీతుల‌మ‌వుతున్నాం. ఎల్ల‌లు లేని నీ గ‌మ‌నం మాకెంతో స్ఫూర్తిదాయ‌కం. నీ స్వ‌చ్ఛ జ‌లాల్లో విషం క‌లిసిపోతోంది. బిడ్డ‌లుగా మేం అన్యాయ‌మైపోతున్నాం. నీ నీళ్లు తాగితే పుణ్యం వ‌స్తుంద‌ని అంటారు. ఇప్పుడు తాగితే క్యాన్స‌ర్ లాంటి ఉప‌ద్ర‌వాలు చుట్టుముట్టేస్తున్నాయి. కోట్ల మంది గొంతులు త‌డిపే గోదార‌మ్మా నువ్వు క‌ష్టంలో ఉంటే బిడ్డ‌లుగా మేం చూస్తూ ఊరుకోలేమ‌మ్మా..!! కాలుష్యం మీద పోరాడి నీ రుణం తీర్చుకుంటాం. వేదంలా ఘోషించే గోదార్ని చూస్తే మా మ‌న‌సు ఉప్పొంగుతోంది. జ‌రుగుతున్న అన్యాయం త‌లుచుకుంటే మా ర‌క్తం గోదారిలా పొటెత్తుతోంది. మాకు విషం వ‌ద్దు.. మంచినీళ్లు కావాలి. అమ్మ‌లాంటి గోదార‌మ్మ‌ని ర‌క్షించుకుంటామ‌ని ప్ర‌తిజ్ఞ చేస్తున్నాం. రండి..గోదావ‌రి మ‌హోద్య‌మంలో క‌లిసి న‌డుద్ధాం..!! సేవ్ గోదావ‌రి.. విశ్వ‌మాన‌వ‌వేదిక..గుండెఘోష‌కు గొంతుక‌''