18, జులై 2015, శనివారం

ముస్లిం సోదరులకు, మిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు......దివ్యమైన ఖురాన్ అవతరించిన మాసం రంజాన్. నెలవంక దర్శనంతో ఈ మాసం ఆరంభమవుతుంది. చాంద్రమానంలో ఇది తొమ్మిదో మాసం. ముస్లింలకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. ప్రపంచంలో ఏ మూల ఎక్కడున్నా భక్తిశ్రద్ధలతో వారు దీక్షలు పాటిస్తారు. రంజాన్ మాసంలో రోజూ అయిదుసార్లు నమాజ్ చేస్తారు. ఖురాన్ పారాయణం చేస్తారు. దానధర్మాలు చేస్తారు. కోపతాపాలు చూపరు. ఆవేశాలకు ఆమడ దూరంలో ఉంటారు.
రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా' రోజా ' ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే 'రోజా ' కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరిమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని ' సహర్' అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ' ఇఫ్తార్' అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు. ఉపవాసదీక్ష పాటించేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే! దీనిని ఖురాన్ ' తఖ్వా' అని అంటుంది.
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు , సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' జకాత్ ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం[2.5%] చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది.
మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది వున్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ , దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం వుంది.
దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని మహమ్మద్‍ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.
ధనిక, బీద తారతమ్యం లేక, సహృదయాలతో సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ద్వేషాలన్నీ సమసి ప్రేమపూరిత భావం ఇనుమడిస్తుంది. ప్రత్యేకంగా సేమ్యాతో చేసిన ఖీర్ తినిపించుకొని ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది. ఈ పండుగను పేద , ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతె ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్‍గాహ్ లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ' ఈద్‍ముబారక్ ' ( శుభాకాంక్షలు) తెలుపుకుంటారు.ఈ నమజ్ కొసము వెల్లదనికి ఒక దారి వఛెదనికి ఇన్కొక్క దారిలొ రవలెను.
ఖురాన్
 దేవదూత జిబ్రయిల్ ఇస్లాం మత చివరి ప్రవక్త మొహమ్మద్ ద్వారా ప్రపంచానికి తమ సందేశం అందించారు. మక్కా పట్టణంలో అబ్దుల్లా, బీబీ అమీనా పుణ్య దంపతులకు హజరత్ మొహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లిం జన్మించారు. ఈయన అరవై మూడేళ్ళు జీవించారు. ఆయన చివరి ప్రవక్తగా మానవులకు దిశానిర్దేశకులుగా ఇస్లాం మతాన్ని స్థాపించి వ్యాప్తి చేసారు. ఇస్లాం అంటే శాంతి. మనోవికారాలను అదుపు చేసుకుని నిత్యం భగవంతుడిని స్మరించే పవిత్ర మార్గం. ఆయన చేసిన దివ్య సందేశాన్ని ఖురాన్ అని అంటారు. సమసమాజ స్థాపనన కోసం మానవతా విలువలు, మానవుల మధ్య సంబంధాలు, దానధర్మాలు, పాపపుణ్య భేదాలు, వాటి ఫలితాలు, స్వర్గం, నరకం, మరణానంతర జీవితం, సత్యం, నీతి నియమాలు వంటివి ఈ పవిత్ర ఖురాన్ లో ఉన్నాయి. ఇందులోని విషయాలను విధిగా పాటించాలని ప్రవక్త బోధ. అరబ్బీ భాషలో ఉన్న ఖురాన్ లో మొత్తం 30 పర్వాలు, 114 నూరాలు, 6666 వ్యాఖ్యలు ఉన్నాయి.
నమాజు …..
ఇది అయిదు రకాలు. ఉదయం అయిదు గంటలకు ఫజర్, మధ్యాన్నం ఒకటిన్నర గంటలకు జొహర్, సాయంత్రం 5.15 గంటలకు అనర్, రాత్రి ఏడు గంటలకు మఘ్ రిబ్, రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఇషా ప్రార్ధనలు చేస్తారు. ప్రతి ముస్లిం కోపతాపాలు ప్రదర్శించరు. అబద్ధమాడరు. వీటిని పాటించడం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందని వారి ప్రగాడ విశ్వాసం. రోజా పాటించేవారు తెల్లవారకముందే లేచి భోజనం చేయాలి. దీన్నే సహర్ అంటారు. ఆ తర్వాత సూర్యాస్తమయం వరకు కూడా పచ్చి నీళ్ళు సైతం సేవించరు.
ఈ నెలలో జరిగే ' ఇఫ్తార్ విందు ' ల్లో ఆత్మీయత సహృద్భావాలు ప్రసుప్టమవుతాయి. పరస్పర ధోరణికి , విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం.
ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని ' రంజాన్' సుగమం చేస్తుంది