20, జులై 2015, సోమవారం

కలుసుకోవలసిందే!

మనం
 ఇరుగు పొరుగునే ఉన్నా
 మనుషులుగా
 కలుసుకోవడమే గగనమవుతున్నప్పుడు
 నలుగురు కలుసుకున్నప్పుడల్లా
 పండగ చేసుకోవలసిందే!
సాంకేతికత ఒక వైపు దూరాలను చెరిపేస్తూ
 ఆత్మీయతలకు కోతపెడుతున్నది!
కరచాలనం లేని
 ఆలింగనం లేని
 కలయిక ఒక కలయికయేనా?
నిస్తంత్రులు మోసుకొచ్చే సంభాషణ
 వట్టి మాటలకే పరిమితం!
మిత్రుడా!
చరవాణి తాను వెంటుండి
 అందరిని మనకు దూరం చేస్తున్నది!
ఒక అబద్ధాన్ని నిజమని భ్రమింప చేస్తున్నది!
ప్రపంచం గుప్పిట్లో ఒదిగినా
 ఆ ప్రపంచంలో మనిషి కనిపించడం లేదు!
యాంత్రికతలో అవసరానికి మించిన
 సౌకర్యం ఉన్నా సౌహార్ద్రం మృగ్యం
 వన్ బై టు చాయ్ సేవనాల నడుమ
 అస్తమించాల్సిన సాయంత్రాలు
 ఊరకే కరిగి పోతున్నవి!
ఉదయాలు
 ఎవరో తలుపుకొట్టిన చప్పుడుతో
 భళ్ళున తెల్లారాలి కదా
 మనిషి అలికిడే లేదు!
తలుపు దగ్గర తడితడిగా పాలపాకెట్లు
 వేడి వేడి వార్తల న్యూస్ పేపర్!
యధావిధిగా నిశ్శబ్ధంగా సంభాషించుకుంటూ
 నాకోసం ఎదురు చూస్తవి!
వాటికి తలుపుకొట్టడం చేతగాదు!
ప్రపంచమిప్పుడు
 తలుపులు మూసుకున్న విడిది!
ముఖ పుస్తకం తెరచినన్నిసార్లన్నా
 ఇంటి తలుపులు తెరుస్తున్నామా!
తెరచినా లాభం లేదు
 మనుషుల అలికిడే లేదు!
పేపరు బిల్లుకో కరెంటు బిల్లుకో
 తలుపులు చప్పుడు చేసినా
 మాటల్లేవ్
 రెక్కలు తెగిన పక్షుల్లా
 చేతిలోకి బిల్లులొచ్చి వాల్తాయి
 జేబులోంచి డబ్బులు రాల్తాయు!
వేసిన కుర్చీలు దుమ్ముకొట్టుకపోతున్నాయి
 ఎవరూ రారు
 వచ్చి కూర్చొని నాలుగు మాటలు
 మాట్లాడే తీరికాలేదు!
అందరికీ అర్థమయ్యే పరి భాష ఒకటే
I WILL CALL BACK U!
రెక్కలొచ్చిన పక్షులు
 ఎక్కడికో ఎగిరిపోయాయి
 వీలు చిక్కినప్పుడల్లా
 డాడీ మమ్మీ జాగ్రత్త!
మాటల్లో సమాచారమే
 హృదయ స్పర్శ లేదు!
ఏమైనా పంచుకోవడానికి
 నేను మాఆవిడే మిగిలాం!
రాకపోకలు లేని
 కలుసుకోవడానికి వీలు లేని
 అదృశ్య చట్టమేదో 144ను అమలు చేస్తున్నట్లున్నది!
ఇన్ని నియంత్రణల మధ్య
 ఇన్ని నిషేధాల మధ్య
 అసంకల్పితంగా విధించుకున్న
 పరిమితుల మధ్య
 నలుగురం కలిసినప్పుడల్లా
 పండగ చేసుకోవలసిందే!
నలుగురం కలుసుకోవడమే
 పండగయినప్పుడు
 విధిగా తరచుగా మనం
 కలుసుకోవల్సిందే!
కలుసుకోవలసిందే!!