29, జులై 2015, బుధవారం

ఆకాశాన్ని తాకాలని

ఆకాశాన్ని తాకాలని
 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని
 చందమామను ముద్దాడాలని
 తహతహ లాడుతున్నది ఈ మూగ మనస్సు
 రేయి పగలు తేడా లేకుండా అవే కలలు
 కలలు నిజం కావాలని
 ఆ కన్న కలలను కళ్ళారా చూడాలని
 రెప్ప వెయ్యటానికి ససేమిరా అంటూ
 విప్పార్చి చూస్తున్నాయి ఈ నీలి కళ్ళు
 శరీరం అలసి సొలసి నిద్రకుపక్రమించినా
 నా కలలను నిజం చేసుకోవాలన్న నా వాంఛ
 హృదయాన్ని మెలి పెడుతూ
 నిద్ర పోనివ్వక మొరాయిస్తున్నది
 నా కలలు నిజమయ్యేనా అని
 నేను కన్న కలలు సాకారం చేసుకోవటానికి
 ప్రణాళికాబద్దంగా వ్యూహాత్మకంగా స్వీయ క్రమశిక్షణతో
 ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి
 అడుగులు ఎలా వెయ్యాలన్న ఊసుతో
 నిద్ర లేని రాత్రులు ఎన్నయినా ఉండనీ
 నా జీవితంలో నాకూ ఓ రోజు ఉన్నది
 నా కలలు పండిన ఆ శుభ దినాన
 నన్ను కించ పరిచిన వారిని
 నన్ను అవమానించిన వారిని
 నన్ను అడుగడుగున అనగత్రొక్కినవారిని
 ప్రేమతో హత్తు కోవాలని ఉన్నది
 నేనేంటో నా మనస్సు ఏంటో చెప్పాలని ఉన్నది
 అందుకే ఏది ఏమయినా నేను ఆకాశాన్ని తాకుతాను
 ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాను
 చందమామను ముద్దాడుతాను