8, జులై 2015, బుధవారం

పుష్కరాలు


వచ్చే మంగళవారమే పుష్కరాలు ప్రారంభం
 మొదటి రోజు మంగళవారం సెంటిమెంట్‌
 మూడవ రోజు అమావాస్య సెంటిమెంట్‌
 నాలుగవ రోజు నుంచే పుష్కర సందడి
 ఆంధ్రప్రభ దినపత్రిక, తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేక కథనం..
రాజమండ్రి : 144ఏళ్ళకోసారి వచ్చే గోదావరి మహాపుష్కర వేడుకలు సరిగ్గా వారం రోజుల్లో ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం 6.20 గంటలకు బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తారు. అదే సమయంలో ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. మొదటిరోజు మంగళవారం రావడం, రెండవరోజు అమావాస్య ముందురోజు, మూడవరోజు అమావాస్య కావడంతో నాలుగవరోజునుంచే ఈ పుష్కర భక్తులసంఖ్య అధికమవ్వచ్చు. నాలుగవరోజు కూడా శుక్రవారం రావడంతో ఐదవరోజు అన్నివిధాలా మంచిదని ఆ రోజు అనూహ్యరీతిలో భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. అమావాస్య, మంగళ, శుక్రవారాల్లో పితృదేవతలకు పిండప్ర దానాలు వంటివి చేయడం అంతగా ఆసక్తి చూపరు. అందుకనే ఆ మూడురోజులు మినహా మిగిలిన రోజుల్లో పుష్కర వేడుకలకు కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు పుష్కర రాజధాని రాజమండ్రికి తరలిరానున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా పుష్కరాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతుండడం మహాపుష్కరాలు కావడంతో కోట్లాదిరూపాయల వ్యయంతో ఈ వేడుకలకు సన్నాహాలు చేస్తుండడంతో దేశవ్యాప్తంగానే కాక ఇతర దేశాలనుంచి భక్తులు రెక్కలు కట్టుకుని గోదావరి చెంతకు వాలిపోవడానికి ఇప్పటికే సన్నాహాలు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 151 , పశ్చిమగోదావరి జిల్లాలో 89 మొత్తం 240 పుష్కరఘాట్‌లు పుణ్యపుష్కరాలకు వేదికలు కాబోతున్నాయి. నదీపరివాహక ప్రాంతాలంతా ఈ పుష్కరాలవేళకోసం పరవశించిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఘాట్‌లవద్ద ఈ పుష్కరాల వైభవాన్ని కీర్తించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వం ఈ పుష్కరాలకు ఏ, బీ, సీ అని మూడుగ్రేడులుగా ఘాట్‌లను విభజించింది. ఆ గ్రేడ్‌లను బట్టీ సౌకర్యాలను కల్పిస్తుంది. పుష్కరఘాట్‌లతోపాటు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌లైన్లు, వీధిలైట్లు, మరుగుదొడ్లు, తాగునీరు, పారిశుద్యంవంటి ఏర్పాట్లను చేపడుతుంది. అలాగే దేవాలయాలన్నీ పుష్కరాలకోసం ముస్తాబవుతున్నాయి. ప్రభుత్వపరంగానే కాక భక్తులు కూడా దేవాలయాల అభివృద్ధిలో తలమునకలై ఉన్నారు. జీవితంలో ఈ పుష్కరాలు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉన్న ఈ వారం రోజుల్లో మరింతగా పుష్కర ఏర్పాట్లు చేయడానికి అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేపడుతోంది. ఇటువంటి మహాపుణ్య కార్యక్రమాల్లో అన్నదానంతోపాటు సేవాకార్యక్రమాలు చేపట్టడానికి మనసున్న మారాజులంతా నడుంబిగిస్తున్నారు. జీవితంలో సంపాదించింది కూడా పట్టుకుపోయేది ఏముండదని మరణానంతరం తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులకోసం పిల్లలు కొట్లాడుకుంటున్న తీరును ప్రత్యక్షంగా చూస్తున్నవారంతా మనసు మార్చుకుని ఉన్నదాంట్లో కొంత సొమ్మును ఇటువంటి సేవాకార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వస్తున్న ఈ పుష్కరాల్లో అన్నదానాలు వంటి కార్యక్రమాలు అనూహ్యరీతిలో జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.