29, జులై 2015, బుధవారం

భగవంతుడా…. యె జీసస్.. హే అల్లాహ్…మా కలాం వస్తున్నారు.ఘనంగా స్వాగతం పలకండి

సెలెబ్రిటీలకు…. పొలిటీషియన్స్ కు రాసిన  బహిరంగ  లేఖలు చాలానే చూశాం. కానీ అబ్దుల్ కలాం అంటే అమితమైన ఇష్టం ఉన్న అభిమాని ఏకంగా భగవంతుడికే లెటర్ రాశాడు. వస్తున్నాడు తన ఆరాధ్య దైవం కాస్త జాగ్రత్తగా చూసుకోమని.. మతాల పట్టింపులు లేకుండా దేవుళ్లందరినీ  చేతులెత్తి మొక్కుతూ… ఇలా రాశాడు తన ఉత్తరం.“దేవుడా… నువ్వు ఏ రూపంలో ఉంటావో నాకు తెలియదు. కానీ ఇప్పుడు శిలువపై నీ రూపాన్ని మొక్కుతున్న, మసీద్ అజా పలుకులలో నిన్ను ఆరాధిస్తున్న, గర్భగుడిలో ప్రాణమిల్లి ప్రాధేయపడుతున్న…  నా కోరిక తీర్చండి దేవుళ్ళు.
ఓ మనిషి అటువైపుగా వస్తున్నాడు. మీ ద్వారాలన్నీ తీసి ఉంచండి ,ఎందుకంటే ఆయన విజేత..జగజ్జేత.. నూరు కోట్ల భారతావని మదిని గెలిచిన మిసైల్ మ్యాన్.  తండ్రీ మీ వాళ్లకు చెప్పి అతనికి హారతి పట్టించండి … ఎందుకంటే ఆయన మలినం లేని మనిషి, కల్మషమెరుగని మహా ఋషి.  దారి పొడవున పూలు జల్లుతూ నీ లోకానికి తీసుకెళ్లు ఎందుకంటే ఆయన చీమకు కూడా హాని తలపెట్టని పరమ సాత్వికుడు. మేళ తాళాలు, భాజా బజాయింపులు ఉండాలి…. ఎందుకంటే ఆ డప్పుల శబ్దాలలో ఆయన మా యువకుల గుండె చప్పుళ్ళనువినాలి.
స్వామీ…  మీ లోకంలో సోమరులకు మా సార్ తో డెమో క్లాస్ ఇప్పించడానికి తీసుకెళ్తున్నావని మాకు తెలుసు… ఇక్కడ జాతినే జాగృతం చేసిన , మా ధీరుడికి అదో పెద్ద లెక్క కాదు. ఎందుకంటే… తనకు తెలిసిన విషయాలను పంచుకుంటూనే తుదిశ్వాసను విడిచిన మహర్షి అతను. గొప్ప లక్ష్యాలున్న యువకుల కళ్లలోకి వచ్చే కలలకి దిశా నిర్ధేశకుడతను.
చెత్త రాజకీయాలంటూ ఛీ కొడుతుంటే… తన రాకతో రాజకీయాలకు పాలాభిషేకం చేసిన మహత్ముడతను.  మోము పై చిరునవ్వును  చెరగనివ్వని 83 యేళ్ళ పసిపిల్లాడతను, దేశ సేవకు తన జీవితాన్నే గులాం చేసిన కలాం అతను.తాను చేసే పనిలోనే దైవాన్ని చూసుకున్న మా దేవుడతను.    ఓ భగవంతుడా….  యె జీసస్.. హే అల్లాహ్…
మా కలాం వస్తున్నారు.ఘనంగా స్వాగతం పలకండి!”