23, జులై 2015, గురువారం

తెనాలిరామలింగడికథ‬ : ‪‎వింతపరిష్కారం

‪‬
ఒకసారి రాయల దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు. అతడికి అనేక భాషలు వచ్చు. దాంతో అతగాడు రాయల కొలువులో ఉండే కవి పండితులతో ఒక పందెం కాశాడు. తనకొచ్చిన అన్ని భాషలూ మాట్లాడి... వాటిలో తన మాతృభాష ఏదో కనిపెట్టమన్నాడు.
ఆంధ్రకవితా పితామహుడిగా పేరు పొందిన అల్లసాని పెద్దన లేచాడు. తనకొచ్చిన భాషల్లో అతనితో మాట్లాడాడు. రకరకాలుగా ప్రయత్నించాడు, వాదించాడు. కానీ ఆ కవి మాతృభాష ఏదో మాత్రం కనిపెట్టలేకపోయాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా లేచి ప్రయత్నించారు. కానీ ఎవరి వల్లా కాలేదు.
ఇదంతా చూసి రాయలు డీలా పడిపోయాడు. ఇక తమకు ఓటమి తప్పదని, తమ పరువు పోయిందని బాధపడసాగాడు.
రాజు బాధను గమనించిన తెనాలి రామలింగడు లేచాడు. ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ ఆ కవి దగ్గరకు వెళ్లాడు. ఎదురుగా నిలబడినట్టే నిలబడి, అతడి కాలును గట్టిగా తొక్కాడు. అతగాడు వెంటనే ‘అమ్మా’ అంటూ కేక పెట్టాడు. వెంటనే రామలింగడు... ‘ఆ తెలిసిపోయింది కవివర్యా... నీ మాతృభాష తెలుగు’ అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కవి తన ఓటమిని అంగీకరించాడు. రాయలు పరమానందభరితుడై రామలింగడిని ఘనంగా సత్కరించాడు.