22, జులై 2015, బుధవారం

శ్రీశ్రీ -ఖడ్గసృష

మరచి పోయిన సామ్రాజ్యాలకు
చిరిగి పోయిన జెండా చిహ్నం
మాయమైన మహాసముద్రాలను
మరుభూమిలోని అడుగు జాడ స్మరిస్తుంది

శిథిలమైన నగరాన్ని సూచిస్తుంది
శిలాశాసనం మౌనంగా
ఇంద్రధనుస్సు పీల్చే ఈవాల్తి మన నేత్రం
సాంద్ర తమస్సు చీల్చే రేపటి మిణుగురు పురుగు

కర్పూర ధూమ ధూపంలాంటి
కాలం కాలుతూనే ఉంటుంది
ఎక్కడో ఎవ్వడో పాడిన పాట
ఎవ్వడో ఎందుకో నవ్వే పాప

బాంబుల వర్షాలు వెలసి పోయాక
బాకుల నాట్యాలు అలసిపోయాక
గడ్డిపువ్వులు హేళనగా నవ్వుతాయి .
గాలి జాలిగా నిశ్వసిస్తుంది

ఖడ్గాన్ని రద్దు చేస్తుంది ఖడ్గం
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం
పొలంలో హలంతో రైతు
నిలుస్తా డీవాలా రేపూ

ప్రపంచాన్ని  పీడించిన పాడు కలని
ప్రభాత నీరజాతంలో వెదకకు
ఉత్పాతం వెనుకంజ వేసింది
ఉత్సాహం ఉత్సవం నేడు

అవనీ మాత పూర్ణ గర్భంలా
ఆసియా ఖండం ఉప్పొంగింది
నవప్రపంచ జనద్వారం
భారతం మేలుకొంటోంది

నేస్తం మన దుఃఖాలకి వాయిదా వేద్దాం
అసౌకర్యాలు మూటకట్టి అవతల పారేద్దాం
ఇంకోమాటు వాగ్వాదం ఇంకోనాడు కొట్లాట
ఈవాళ మాత్రం ఆహ్లాదం
ఈవాళ మాత్రం తురుఫాసు
శ్రీశ్రీ -ఖడ్గసృష్టి