18, జులై 2015, శనివారం

జై శ్రీరామ్

రామాయణంలో శ్రీరాముడి వినయం ఎలాంటిదో, హనుమంతుని వినయం ఎలాంటిదో చూద్దాం.........
 "విద్య యొసగు వినయంబు" అంటారు కదా. ఆ వినయం నేటి విద్యార్థులలో ఏ మాత్రం ఉందో అందరికీ తెలుసు. ఏ చిన్న విజయం సాధించినా ఉద్రేకాన్ని అణచుకోలేక విపరీతంగా పొంగిపోయి అహంకరించే నేటి మనుషులు ఉన్న సమాజంలో ఇలాంటి విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మొదట *రామచంద్రుడి* వినయం చూద్దాం...
అందరికీ తెలుసు అహల్యను తన పాదాలతో పాపవిమోచనం కలిగించాడని. ఇక్కడ శ్రీరాముడు తనే శాపవిమోచనం కలిగించాననే అహంకారం ఏమాత్రం లేకుండా అహల్య శాపవిమోచనం పొందిన వెంటనే ఆమె తన కన్నా వయసులో పెద్దది అవటం చేత మరియు ఒక ఋషి భార్య అవడం చేత తనే ముందుగా మోకాళ్ళ మీద కూచుని అహల్యకు నమస్కారం చేసాడు.
అలానే విశ్వామిత్రుడి యజ్ఞాన్ని అడ్డుకుంటున్న రాక్షసులను చంపిన తర్వాత ఋషులందరూ రాముడిని "ఇంత చిన్న వయసులోనే అలాంటి రాక్షసులను చంపగలిగావు కదా" అంటూ పొగిడారు. రాముడు ఏమాత్రం అహంకరించకుండా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
ఇక *హనుమంతుని* వినయం ఎంతటిదో చూద్దాం...
లంకలో సీతమ్మను కలుసుకొన్న తర్వాత సీతమ్మ " హనుమా! నీవు ఎంత బలవంతుడివి. ఇంత సముద్రాన్ని దాటి నువ్వొక్కడివే దాటగలిగావు" అంది. ఇలాంటి మాటే గనుక నేటి పిల్లలతో కానీ, పోటీలలో పాల్గొని కొద్దిగా బాగా ప్రదర్శన ఇచ్చిన పోటీదారుతో కాని అంటే ఉద్రేకంతో ఎంతగా అరుస్తారో,ఎంత అహంకరిస్తారో టీవీ లలో మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ హనుమంతుడు చూపిన వినయం చూస్తే నేటి సమాజం ఆశ్చర్యపోక మానదు.
హనుమంతుడన్నాడు, " అమ్మా! మా సైన్యంలో నాతో సమానమైన బలవంతులూ, నా కన్నా అధికులూ ఐన వారు ఉన్నారు. అంతేకాని నాకన్నా తక్కువ వారు లేరు. ఒక ఇంట్లో ఆడవారికి ఏదైనా కబురు చేయడానికి ఒక పిల్లవాడినో, ఇంట్లో అందరికన్నా తక్కువ వారినో పంపిస్తారు. అంతేకాని పెద్దవారు రారు కదా !".