23, జులై 2015, గురువారం

ఆకలిగా లేదా..!విస్తట్లో పంచభక్ష్యపరమాన్నాలు ఉన్నా కొందరికి ముద్ద నోట్లోకి దిగదు. అదేమిటంటే ఆకలిగా లేదంటారు. జీర్ణక్రియలో లోపాల వల్లే ఆకలి సరిగా ఉండదు.
చిన్న చిన్న టిప్స్‌ ఫాలో అయిపోండి.. ఆత్మారాముడితో ఆకలి కేకలు పెట్టించండి...!
• నిమ్మరసం : జీర్ణక్రియను వేగవంతం చేయడంలో నిమ్మరసం భలేగా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలిగించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఆకలి మందగించినపుడు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. కాసేపటికి అన్నమో రామచంద్రా అనకమానరు...!
• ఖర్జూరాలు : పోషక విలువులు మెండుగా ఉన్నా ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం కూడా ఎక్కువే. దీన్ని రసంలా చేసి కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలి లేమి తీరిపోతుంది.
• అల్లం : వికారం, అజీర్తికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ నాలుగైదు అల్లం ముక్కలను దవడన పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీనివల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలి కూడా బేషుగ్గా వేస్తుంది.
• మెంతులు : పొట్టలో గ్యాస్‌ను బయటకు తోసేయడంలో మెంతులు బాగా పని చేస్తాయి. దీంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ మెంతిపొడిని తేనెతో కలిపి తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి పుడుతుంది.
• ద్రాక్ష : ద్రాక్షలో విటమిన్‌-సి ఉంటుంది. అది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్షపళ్లు తినండి. తీసుకున్న ఆహారం తొందరగా అరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.